మర్యాద చేద్దాం
పూర్వం కళింగ రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవాడు. ఆయనకి పన్నెండు మంది శిష్యులు. వారు చాలా అమాయకులు. వయసు పెరిగినా వారికి బుద్ధి పెరగలేదు. వారు చేసే పనులు కోపంతో పాటు నవ్వూ తెప్పిస్తుంటాయి.
ఒకరోజు పరమానందయ్యగారు. భార్యతో కలిసి గుడికి వెళ్ళారు. అదే సమయంలో పొరుగూరి నుండి పేరయ్య అనే పండితుడు వచ్చాడు. వస్తూనే “ఓయ్ పరమానందం! ఒరేయ్ పరమా!" అంటూ కేకలు వేశాడు. ఆ కేకలు విన్న శిష్యులకు విపరీతమైన కోపం వచ్చింది. తమ గురువుగారిని "ఓయ్, ఒరేయ్ అంటాడా!" అనుకున్నారు.
అంతే ఆయన్ని ఇంట్లో స్తంభానికి కట్టేశారు. కొట్టటానికి కర్రల కోసం ఇద్దరు బయటికి వెళ్ళారు.
ఆ పండితుడి అదృష్టం బాగుంది. అదే సమయానికి పరమానందయ్య దంపతులు ఇంటికొచ్చారు. వస్తూనే పరమానందయ్య గారు “అయ్యో.... అయ్యో... ఇదేం అఘాయిత్యంరా! ఈయన నా స్నేహితుడు రా!" అంటూ పేరయ్య కట్లు విప్పాడు. "సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారుగా, పరమా!" అంటూ పేరయ్య బావురుమన్నాడు.
శిష్యులు బిక్కమొహం వేశారు. పరమానందయ్య గారు "పాపం వీళ్ళకేమీ తెలియదు. ఒట్టి అమాయకులు, వారిని క్షమించు" అన్నాడు.
పేరయ్య పరమానందయ్య దంపతులను పెళ్లికి పిలిచి వెళ్ళిపోయాడు. అప్పుడు పరమానందయ్య శిష్యులను పిలిచి కోప్పడి, “ఒరేయ్ మన ఇంటికి వచ్చే అతిథుల్ని గౌరవించి మర్యాదలు చేయాలి" అని చెప్పాడు. శిష్యులు సరేనని తలలూపారు.
పరమానందయ్య గారు భార్యతో కలసి పేరయ్య కూతురి పెళ్ళికి పొరుగూరు వెళ్ళారు. అదే అదనుగా ముగ్గురు దొంగలు ఆ రాత్రి పరమానందయ్య గారి ఇంటికి దొంగతనానికి వచ్చారు. ఇంటికి కన్నం వేయటం మొదలు పెట్టారు.
ఆ అలికిడికి శిష్యులకు మెలకువ వచ్చింది. శిష్యుల్లో ఒకడు, “ఒరేయ్! పెద్ద మనుషులురా!అతిథి దేవుళ్ళు! ఇంట్లోకి దూరి వస్తున్నారు. బాగా మర్యాద చేద్దాం” అన్నాడు.
వాళ్లు లోపలికి దూరివస్తున్న ఒక్కొడురినీ లోపలకి లాగారు. ఎవరూ లేరని ఇంట్లో చొరబడిన దొంగలు ఆ పన్నెండుమంది శిష్యులను, మొదట భయపడ్డారు.
తరువాత వారి అమాయకత్వాన్ని గ్రహించారు. చప్పుడైతే ఊరి జనులు నిద్ర లేస్తారు అని మౌనంగా ఉన్నారు.
శిష్యులు గురువుగారి మాటలు గుర్తుంచుకున్నారు. అతిథుల పూజ మొదలు పెట్టారు. ఇద్దరు పోయి బిందెలతో నీళ్ళు తెచ్చి, వాళ్ళ నెత్తిన కుమ్మరించారు. ఆ చలి కాలపు చన్నీళ్ళకి దొంగలు గజగజ వణికారు!
మరో ఇద్దరు అలంకరించటానికి పసుపు, కుంకుమ, గంధం తెచ్చి పూశారు. కళ్ళ నిండా పసుపు, కుంకుమ పడి మండటంతో దొంగలు మూలగటం మొదలు పెట్టారు. శిష్యులు సాంబ్రాణి తెచ్చి ధూపం వేయసాగారు. ఇల్లంతా పొగలు కమ్మి, కిటికీల్లోనించి పొగ బయటకు రావటం మొదలైంది.
ఆ దారిన పోతున్న రాజ భటులు "గురువుగారిల్లు కాలిపోతున్నదిరా" అనుకొని గబగబా తలుపులు తోసుకుని లోపలికి వచ్చారు. శిష్యుల చేతిలో చిత్రహింసలు పడుతున్న వారిని దొంగలుగా గుర్తించారు. వెంటనే వారిని బంధించి రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్ళారు.
మరుసటి రోజు వచ్చిన గురువుగారు శిష్యుల అమాయకత్వానికి నవ్వుకొన్నారు. ఇంటిని దొంగలు దోచుకోకుండా కాపాడినందుకు సంతోషించారు. దొంగలను పట్టించిన
పరమానందయ్య శిష్యులను రాజు గారు పిలిపించి ఘనంగా సన్మానించారు.
అర్థాలు :
పండితుడు = బాగా చదువుకున్నవాడు , అన్నీ తెలిసినవాడు
జనులు = ప్రజలు
అమాయకత్వం = తెలియనితనం
పొరుగూరు = పక్క ఊరు
దంపతులు = భార్య భర్తలు
అఘాయిత్యం = చేయకూడని పని
బావురుమను = బోరున ఏడవటం
బిక్కమొహం = ఏడుపు ముఖం
అతిధి = అనుకోకుండా ఇంటికి వచ్చేవారు
మర్యాద = గౌరవం
అలికిడి = శబ్దం
కుమ్మరించటం = ఒక్కసారిగా పొయ్యటం
చిత్రహింసలు = నానాబాధలు
బంధించి = కట్టివేసి
సన్మానించటం = గౌరవించడం
ఘనంగా = గొప్పగా
పాత్రలు –
పరమాందయ్య,
పేరయ్య,
12 మంది శిష్యులు ,
దొంగలు
సంభాషణ :
"ఓయ్ పరమానందం!
ఒరేయ్ పరమా!" – పేరయ్య
"సమయానికి నువ్వు
రాకపోతే చంపేసేవారుగా, పరమా!" – పేరయ్య
పాపం వీళ్ళకేమీ
తెలియదు. ఒట్టి అమాయకులు. వారిని క్షమించు". – పరమానందయ్య
Post a Comment
0 Comments