అలంకారాలు Usefull for TS AND AP
అలంకారాలు
భాషకు సౌందర్యమును కలిగించేవి అలంకారాలు, ఆభరణాలు అందానిచ్చినట్లే అలంకారాలు భాషకు సొగసును కలిగిస్తాయి.
ఇవి రెండు విధాలు,
1. శబ్దాలంకారాలు 2. అర్ధాలంకారాలు
1.శబ్దాలంకారాలు: శబ్దం ప్రధానంగా కవితకు అందం కలిగించేవి శబ్దాలంకారాలు,
ఇవి ప్రధానంగా మూడు విధములు.
అవి.
1.అనుప్రాసము
2. యమకము
3. ముక్తపదగ్రస్తం.
1. అనుప్రాసము: ఒక అక్షరంగాని, ఒక పదంగాని ఒకటి కంటే ఎక్కువసార్లు ఆవృతమయితే అనుప్రాసాలంకారం. ఒక ధ్వని అనేకసార్లు పునరుక్తం కావడం వలన వినడానకి ఇంపుగా ఉంటుంది.
అనుప్రాసాలంకారంలో వృత్యానుప్రాస, ఛేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస అనే భేదాలున్నాయి..
1.వృత్యానుప్రాస:
వృత్యానుప్రాస అంటే ఒకటిగాని అంతకంటే ఎక్కువ వర్గాలుగాని అనేకమార్లు పునరుక్తం కావడం. ఒక హల్లుగాని రెండు, మూడు హల్లులు గాని కలిసి అయినా, వేరుగా అయినా మళ్ళీ మళ్ళీ వస్తే వృత్యానుప్రాస.
ఉదా: నీకరుణాకటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారము.
వివరణ: పై వాక్యంలో 'క్ష' అనే అక్షరం అనేక మార్లు రావడం వలన వృత్యానుప్రాసాలంకారం. మరికొన్ని
ఉదాహరణలు:
1. మకరందబిందు బృంద రసస్వందన మందరమగు మాతృభాషయే.
2 చూరుకు, తీరుకు, యేరుకు, నారకు, దారువును వాడు నరవర్తులిలలోన్. అంది
3. అడిగెదనని కడువడిజను
నడిగినదను మగుడనుడుగడని నడయుడుగున్.
4. ఆమె కడవతో వడివడి అడుగులతో గడపను దాటింది.
5. చిటపట చినుకులు టపటపమని పడుతున్నవేళ.
ఈ మెటీరియల్ ను మీ మిత్రులకు షేర్ చేయగలరు.
6. రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది.
2. ఛేకానుప్రాస: (10 - 35)
హల్లుల జంట అర్ధభేదంతో వెంట వెంటనే వస్తే దానిని | “ఛేకానుప్రాస' అంటారు. చేక అనగా జంట.
ఉదా: నీకు వంద వందనాలు.
వివరణ: పై వాక్యంలో 'వంద, వంద' ప్రక్క ప్రక్కనే అర్థభేదంతో వచ్చాయి.
మరికొన్ని ఉదాహరణలు:
1. అనాధనాధ నందనందన నీకు వందనం.
2 కందర్ప దర్పదములగు సుందర దరహాసరుచులు.
3. లాటానుప్రాస: వాక్యంలో ఒకే పదం అర్థంలో తేడా లేకున్నా తాత్పర్యంలో
వెంటవెంటనే ప్రయోగించడం లాటానుప్రాస.
ఉదా:-
కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
వివరణ: మొదటి 'కరములు' అనే పదానికి 'చేతులు' అని అర్ధం.
రెండవ 'కరములు' అనే పదానికి 'ధన్యమైన చేతులు' అని అర్ధం.
మరికొన్ని ఉదాహరణలు:
హరిభజియించు హస్తములు హస్తములు. (చేతులే, నిజమైన చేతులు) చిత్త శుద్ధితో జేసెడి సేవ సేవ. (సేవయే నిజమైన సేవ)
4. అంత్యానుప్రాస:
ఒకే అక్షరం లేదా ఒకే పదం పాదాంతమున పునరావృతమైతే అంత్యానుప్రాస. పాదానికి చివరలో వచ్చే ప్రాస అంత్యానుప్రాస.
ఉదా:
1. నగారా మోగిందా
నయాగరా దుమికిందా
2. కొందరికి రెండు కాళ్ళు
రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు
ఉన్న వాళ్ళకి నాలుగు కాళ్ళు
3. అప్పుడు మాకులం వారిని ఆడవద్దన్నారు.
తర్వాత అన్ని కులాల వారిని ఆడవచ్చన్నారు.
2.యమకం:
వాక్యంలో ఒకే పదం అర్ధభేదంతో ప్రయోగించడం యమకం...
ఉదా: లేమా! దనుజుల గెలువగలేమా ?
వివరణ: ( లేమ = స్త్రీ; గెలువగలేమా = గెలవడానికి మేమిక్కడ లేమా(ఉన్నాం కదా)
మరికొన్ని ఉదాహరణలు:
1. ఆ తోరణం శత్రువుల తోరణానికి కారణమైంది.
2 పురమునందు నంతి పురమునందు
3. మానవా! నీప్రయత్నం మానవా.
4. పాఱజూచిన పరసేన పాఱజూచు
3. ముక్తపదగ్రస్తం :
పాదాంతమున వదిలిన పదాన్ని మరలా వెంటనే పాదారంభంలో గ్రహించడాన్ని
ముక్తపదగ్రస్తం అంటారు.
ఉదా:
1. కలయదిక్కులబర్వత విల్లు విరిగె
విరిగే రాజన్యుల విపుల మానములు.
2 సుదతీ నూతన మదనా
మదనాగ తురంగ పూర్ణమణిమయసదనా సదనామయ గజరదనా
రదనాగేంద్ర నిభాకీర్తి రసనరసింహా!
@అర్ధాలంకారాలు :
అర్ధం ప్రధానంగా భాషకు అందాన్ని కలిగించేవి అర్ధాలంకారాలు.
1. ఉపమాలంకారం :
ఉపమా అనగా పోలిక అని అర్ధం.
ఉపమేయాన్ని ఉపమానంతో
మనోహరంగా పోల్చి చెప్పడాన్ని 'ఉపమాలంకారం' అంటారు.
దీనిలో 4 అంశాలు ఉంటాయి.
నాలుగూ ఉంటే పూర్ణోపమ.
ఏవైనా లోపిస్తే లుప్తోపమ.
1. ఉమమేయం:- దేనినైతే పోలుస్తున్నామో అది.
2 ఉపమానం:- దేనితోనైతే పోలుస్తున్నామో అది.
3. ఉపమా వాచకం:- ఉపమానాన్ని సమాన ధర్మంతో కలపడానికి వాడే పదం. -
4. సమాన ధరం:- ఉపమాన, ఉపమేయాలలో ఉండే ఒకే లక్షణం
ఉదా:
1. సీత ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది.
సీత ముఖం- ఉ.మే,
చంద్రబింబం- ఉమా,
వలె-ఉ.వా,
అందంగా స.ధ
2. సీత ముఖం చంద్రబింబం వలె ఉంది.
(లుపోపమ) సీత ముఖం - ఉ.మే.. చంద్రబింబం- ఉ.మా, వలె - ఉ.వా
మరికొన్ని ఉదాహరణలు:
1. సంగీతం అమృతం వలె మధురంగా ఉంది.
2. ఓ కృష్ణా! నీ కీర్తి హంసలాగా ఆకాశగంగలో మునుగుతూ ఉంది.
3. శ్రీమంత్ చొక్కా మల్లెపువ్వులా తెల్లగా ఉంది.
4. ఈ మంటలు ప్రళయాగ్నివోలె దిక్కులన్నీ కప్పివేస్తున్నాయి. -
5. ఏకలవ్యుడు అర్జునుడివలె గురి తప్పని విలుకాడు.
6. రైతుముని వలె తెల్లవారు జామునే లేస్తాడు.
7. కిశోర్ లేడి పిల్లలా పరిగెత్తుతున్నాడు.
2. ఉత్ప్రేక్షాలంకారం :
ఉత్యేక్ష' అనగా ఊహ అని అర్ధం. సమాన ధర్మంచేత
ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడాన్ని ఉత్ప్రేక్షాలంకారం అంటారు.
ఉదా: కుముదినీరాగ రసబద్ద గుళకయనగ
- జుంద్రుడుదయించె గాంతి నిస్తంద్రుడగుచు.
వివరణ: పై ఉదాహరణలో ఉపమేయమైన చంద్రుణ్ణి "కుముదినీరాగ రసబద్దగుళక” అని ఊహించి
చెప్పడం జరిగింది.
కాబట్టి ఇది ఉత్ప్రేక్షాలంకారం. మరికొన్ని ఉదాహరణలు:
1. ఏనుగు నడయాడే కొండ యో అన్నట్లుంది.
2. ఈ వెన్నెల పాలవెల్లియో అన్నట్లుంది.
3. ఈ ఎండ మండే నిప్పుల కొలిమా అన్నట్లుంది.
4. కొలనులోని పువ్వులా! అన్నట్లు ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి.
5. ఈ మేఘాలు గున్న ఏనుగులా! అన్నట్లు ఉన్నాయి.
6. ఈ ఇంటి వాతావరణం పండుగ వాతావరణమా అన్నట్లు ఉన్నది.
3. రూపకాలంకారం : ఉపమాన ధర్మాన్ని ఉపమేయంలో
ఆరోపించి వీటి రెంటికి అభేదాన్ని (భేదం లేదని) చెప్పడమే రూపకాలంకారం.
ఉదా: ఆయన మాట కఠినమైనా మనస్సు వెన్న, వివరణ: పై వాక్యంలో
మనసు- ఉపమేయం (పోల్చబడేది)
వెన్న - ఉపమానం ( పోల్చినది)
ఉపమానమైన వెన్న' లక్షణాలను ఉపమేయమైన మనసుకు' భేదం లేకుండా పోలడం జరిగింది. అంటే వెన్నకు, మనసుకు భేదం లేదు. రెండూ ఒకటే(మెత్తనివే) అనే భావాన్ని ఇస్తున్నది కాబట్టి రూపకాలంకారం.
మరికొన్ని ఉదాహరణలు:
1. మా అన్న చేసే వంట నలభీమపాకం.
2 కుటుంబానికి తండ్రి హిమగిరి శిఖరం
3. లతాలలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లిరి.
4. రుద్రమ్మ చండీశ్వరీదేవి జలజలా పారించె శాత్రవుల రక్తమ్ము,
5. ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే!
6. మా నాన్న గారి మాటలే వేదమంత్రాలు.
7. ఉపాధ్యాయుడు జ్ఞాన జ్యోతులను ప్రకాశింపచేస్తాడు.
8. నగరారణ్య హోరు నరుడి జీవనఘోష.
9. వాన జాణ చినుకు పూలను చల్లింది.
4. అర్థాంతరన్యాసాలంకారం :
సామాన్యాన్ని విశేషం చేతగాని, విశేషాన్ని సామాన్యం చేతగాని సమర్ధించి చెప్పే అలంకారం అర్ధాంతరన్యాసాలంకారం.
ఉదా: శివాజీ కళ్యాణ దుర్గాన్ని సాధించాడు.
వీరులకు సాధ్యము కానిది లేదుకదా!
వివరణ: పై వాక్యంలో మొదటిది విశేష విషయం రెండవది సామాన్య విషయం.
అంటే విశేష విషయాన్ని సామాన్య విషయంతో సమర్ధించాం. కాబట్టి దీనిలో అర్ధాంతరన్యాసాలంకారం ఉంది.
ఉదాహరణలు:
1. గొప్ప వారితో ఉన్న సామాన్యులనూ గౌరవిస్తారు. (సామాన్య విషయం)
పూవులతోపాటు దారాన్ని కూడా సిగనెక్కిస్తారు. (విశేష విషయం)
2. హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు. (విధవారం)
మహాత్ములకు సాధ్యం కానిది లేదుకదా! (సామాన్య వాక్యం)
3. మేఘుడంబుధికి పోయి జలంబు తెచ్చి ఇస్తాం
లోకోపకర్తలకిది సహజగుణము.
5.అతిశయోక్తి అలంకారం :
విషయాన్ని ఉన్న దాని కంటే ఎక్కువ చేసి చెప్పడం.
ఉదా:-దేవాలయగోపురాలు ఆకాశానికంటుతున్నాయి.
వివరణ:-
పై వాక్యంలో గోపురాల ఎత్తును ఉన్న ఎత్తుకంటే ఎక్కువ చేసి చెప్పడం జరిగింది.
అంటే అతిశయం గా చెప్పడం అన్నమాట.
ఇలా చెప్పడాన్ని అతిశయోక్తి అంటారు.
ఉదాహరణలు
1. మా పొలంలో బంగారం పండింది.
2. మా చెల్లెలు తాటి చెట్టంత పొడవుంది.
3. చుక్కలు తలపూవులుగా అక్కజముగ మేనుపెంచి యంబర వీధిన్ వెక్కసమై చూపట్టిన అక్కోమలి ముదము నొందె ఆత్మస్థితిలోన్.
4. హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
5. మా ఊర్లో సముద్రమంత చెరువు ఉన్నది.
6.స్వభావోక్తి అలంకారం:
జాతి, గుణ, క్రియాదులచే స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెబితే 'స్వభావోక్తి' అంటారు.
విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడమే స్వభావోక్తి అలంకారం.
ఉదా: ఆ ఉద్యానవనంలోని లేళ్ళు చెవులు రిక్కించి, చంచల నేత్రాలతో పరిగెడుతున్నాయి.
వివరణ: పై ఉదాహరణలో లేళ్ళ స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పబడింది. కాబట్టి ఇది స్వభావోక్తి
అలంకారం.
ఉదాహరణలు:
1. తుమ్మ చెట్టు పూలు చిన్న, చిన్నవిగా పసుపు రంగులో ఉన్నాయి.
2 అనుచేన్ జేవుఱు మీఱు కన్నుగవతో, నాస్పందదోష్ఠంబుతో ఘనహంకారముతో నటద్భుకుటితో గర్టిల్లు నాభన్సలేశుని జూడన్..
7. దృష్టాంతాలంకారం:
వాక్యాలకు బింబ ప్రతిబింబత్వం (ఒక భావం అర్థం కావడానికి మరోభావం అద్దంలో చూపించినట్లు) ఉంటే దాన్ని 'దృష్టాంతాలంకారం' అంటారు.
1. ఓ రాజా! నీవే కీర్తిమంతుడవు - చంద్రుడే కాంతిమంతుడు.
2 తింటే గారెలే తినాలి - వింటే భారతమే వినాలి.
8. వ్యాజస్తుత్యలంకారం : పైకి నింద లోపల స్తుతి ఉండే అలంకారం వ్యాజస్తుత్యలంకారం. దీనినే
'నిందాస్తుతి' అని కూడా అంటారు.
ఉదా: ఓ గంగా! పాపాత్ములను కూడా స్వర్గాన్ని చేర్చే నీకు వివేకం లేదు.
9.శ్లేషాలంకారం: ఒకే శబ్దం అనేక అర్థాలను ఆశ్రయించుకొని ఉంటుంది. నానార్థాలను
కలిగి ఉండే అలంకారం శ్లేష...
ఉదా: మానవ జీవనం సుకుమారం,
వివరణ:
1. మానవ (ఆధునిక) జీవితం సుకుమారమైనది.
2.మానవ (మనిషి) జీవితం సుకుమారమైనది ఒకే వాక్యం రెండు వేర్వేరు అర్ధాలను ఇచ్చింది.
ఉదాహరణలు:
1. మిమ్ము మాధవుడు బ్రోచుగాక.
2 నీవేల వచ్చెదవు.
3. రాజు కువలయానందకరుడు.
4. మావిడాకులు తెచ్చివ్వండి.
5. ఆవాన కోయిలను పూర్తిగా తడిపింది.
10. అనన్వయాలంకారము: ఉపమాన ఉపమేయము ఒకటే వస్తువగుచో అది అనన్వయాలంకారం.
ఉదా: చంద్రుడు చంద్రుని వలె కాంతిమంతుడు.
11. ప్రతీపాలంకారం: ఉపమానమును ఉపమేయంగా చెప్పినయెడల అది ప్రతీపాలంకారము.
ఉదా:
1.పద్మములు నీకనులతో సమానం
2 పూర్ణచంద్రుడు నీముఖసముడు.
data-ad-client="ca-pub-6103204285982720" data-ad-slot="7550769495" data-ad-format="auto" data-full-width-responsive="true">
12. దీపకాలంకారము: ఉపమేయ(వర్ణము) ఉపమానము(అవర్ణము)నకు ధర్మక్యము చెప్పబడినచో
అది దీపకాలంకారం.
ఉదా: ఏనుగు మదము చేతను, రాజు ప్రతాపము చేతను ప్రకాశించుచున్నారు. ఇందు రాజు ఉపమేయం, ఏనుగు ఉపమానం, ప్రకాశించుట సమాన ధర్మము. ఈ ధర్మము రాజునకును, ఏనుగునకును సమానమే కనుక ఏక ధర్మాన్వయం కలిగి ఇది దీపకాలంకారమైనది.
Post a Comment
1 Comments
R. Bharathi
ReplyDelete